మా జట్టులోని విదేశీ ఆటగాళ్లు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు: ముంబై ఇండియన్స్

10-05-2021 Mon 16:56
  • భారత్ లో విరుచుకుపడుతున్న కరోనా
  • అర్థాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్
  • తమ ఆటగాళ్లు ఆరోగ్యంగా ఉన్నారన్న ముంబై జట్టు
Mumbai Indians foreign players reached destinations

మన దేశంలో కరోనా వైరస్ కేసులు రోజుకు 4 లక్షలకు పైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం ఐపీఎల్ పై కూడా పడింది. క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ అర్థాంతరంగా ముగిసింది. మరోవైపు కరోనా నేపథ్యంలో, ఐపీఎల్ ఆటగాళ్లు విపరీతమైన భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే. తమ స్వదేశాలకు వెళ్లగలమా? లేదా? అనే ఆందోళనలను పలువురు ఆటగాళ్లు వెలిబుచ్చారు. అయితే, ఐపీఎల్ ను బీసీసీఐ ఆపివేయడంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు బయల్దేరారు.

ఈ క్రమంలో, తమ జట్టుకు ఆడుతున్న విదేశీ ఆటగాళ్లందరూ వారి గమ్యస్థానాలకు చేరుకున్నారని ముంబై ఇండియన్స్ ప్రకటించింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ముంబై ఇండియన్స్ కు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం మాల్దీవుల్లో ఆగిపోయి, క్వారంటైన్ లో ఉన్నారు. ఇండియా నుంచి వచ్చే వారిపై ఆస్ట్రేలియా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లతో పాటు శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే కూడా మాల్దీవుల్లోనే ఉన్నాడు. భారత్ నుంచి వచ్చే వారిపై శ్రీలంక కూడా నిషేధం విధించడంతో ఆయన కూడా మాల్దీవులకు వెళ్లాడు.