వ్యాక్సినేషన్ పై న్యాయవ్యవస్థ జోక్యం తగదు: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

10-05-2021 Mon 16:43
  • దేశంలో వ్యాక్సినేషన్ పై స్పందించిన సుప్రీం
  • సుమోటోగా విచారణ
  • గతరాత్రి అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
  • నేడు విచారణ.. సర్వర్ డౌన్ అయిందన్న ధర్మాసనం
  • తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Centre urges Supreme Court against judicial interference

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల్లో వ్యత్యాసం, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆలస్యం వంటి అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించడం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని వివరణ కోరగా, కేంద్రం గతరాత్రి అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం అఫిడవిట్ ను సుప్రీంకోర్టు నేడు పరిశీలించింది. ఈ సందర్భంగా అఫిడవిట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

వ్యాక్సినేషన్ అంశంలో న్యాయపరమైన జోక్యాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం తన వాదనలు వినిపించింది. అర్థవంతమైనదే అయినప్పటికీ అత్యుత్సాహంతో కూడిన జోక్యం విపరిణామాలకు దారితీస్తుందని, ఊహించని, అనాలోచిత పర్యవసానాలకు కారణమవుతుందని కేంద్రం వివరించింది.

"ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశంలో శాస్త్రపరమైన, వైద్యపరమైన నిపుణుల సలహాలతో రూపొందించిన విధానం అమలు చేస్తున్నాం. ఇందులో న్యాయపరమైన జోక్యానికి అతికొద్ది అవకాశం మాత్రమే ఉంది. పరిష్కార మార్గాలు కనుగొనే క్రమంలో... నిపుణుల సలహాల కొరత, పరిపాలనా అనుభవం లేమి, వైద్యులు, శాస్త్రజ్ఞులు, నిపుణులు, కార్యనిర్వాహక వ్యవస్థల సలహాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తే జరిగే పరిణామాలు అనూహ్యం.

వ్యాక్సిన్ల ధరలకు సంబంధించిన అంశం సహేతుకమైనదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకే రీతిలో ఉంది. రెండు వ్యాక్సిన్ సంస్థలతో ఒప్పందం తర్వాతే ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు 18 నుంచి 45 ఏళ్ల వయో విభాగాల ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాయి" అని కేంద్రం తన అఫిడవిట్లో వివరించింది.

కాగా, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ పై విచారణకు ఉపక్రమించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, లావు నాగేశ్వరరావు, ఎస్.రవీంద్ర భట్ లతో కూడి త్రిసభ్య ధర్మాసనం సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. తమ సర్వర్ డౌన్ అయిందని, అఫిడవిట్ పై ఇవాళ విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.