COVID19: కాటికాపర్లపై పని ఒత్తిడి.. మరోపక్క కరోనా ముప్పు!

  • ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ వేయాలని డిమాండ్
  • రోజూ వందల కొద్దీ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
  • 18 గంటలు డ్యూటీ చేస్తున్నామని ఆవేదన
  • తినడానికీ టైం లేదన్న బాధ
  • సరైన వసతులూ కరువేనని ఆందోళన
  • గ్లోవ్స్, మాస్కులు ఇవ్వట్లేదని ఆరోపణ
Overworked and underprotected Crematorium workers demand priority vaccination

కరోనాతో ఎవరైనా చనిపోయారని తెలిస్తే అటువైపుగా వెళ్లేందుకూ ప్రజలు భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ నిత్యం పదులు, వందల సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ తామూ కరోనా పోరులో ముందే ఉన్నామని శ్మశాన వాటికల్లో పనిచేసే సిబ్బంది (కాటి కాపరులు) నిరూపిస్తున్నారు. కానీ, వారి పనిని మాత్రం ఎవరూ గుర్తించట్లేదన్న ఆవేదన వారిలో ఉంది.

ముఖ్యంగా ఢిల్లీ శ్మశాన వాటికలలో పనిచేసే సిబ్బందికి పని ఒత్తిడి విపరీతంగా ఉంటోంది. ఏ రోజుకారోజు పని ఎక్కువైపోతోందని, తమకు కరోనా ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో తమకు వ్యాక్సిన్ వేయకుండా, సరైన రక్షణ లేకుండా పనిచేయలేమని తేల్చి చెబుతున్నారు. టీకా కార్యక్రమంలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.

చాలా మంది సిబ్బందికి మాస్కులుగానీ, గ్లోవ్స్ గానీ అధికారులు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. చాలా మంది సిబ్బంది పేదోళ్లేనని, ఎన్95 మాస్కులు కొనే స్తొమత వారికి లేదని ఢిల్లీ గేట్ ఖబ్రస్థాన్ లో పనిచేసే 35 ఏళ్ల షేర్ సింగ్ చెప్పాడు.

తమ డిమాండ్ల కోసం పోరాటం చేద్దామన్నా, ధర్నాలకు దిగుదామన్నా ఇది తగిన సందర్భం కాదని ఊరుకుంటున్నట్టు దహన క్రియల సందర్భంగా పూజలు నిర్వహించే రామ్ కరణ్ మిశ్రా అనే ఓ పూజారి చెప్పాడు. శ్మశానాల్లోని సిబ్బందికి సరైన వసతులే లేవని చెప్పాడు. గతంలో రోజూ 10 నుంచి 15 మృతదేహాలను మాత్రమే ఖననం చేసేవాళ్లని, కానీ, ఇప్పుడు రోజూ 100 నుంచి 150 శవాలు వస్తున్నాయని అన్నాడు.

పని ఒత్తిడి పెరిగిందని, గతంలో 10 గంటల పాటు డ్యూటీ చేస్తే.. ఇప్పుడు 18 గంటలు చేస్తున్నామని అన్నాడు. పని గంటలు పెరిగాయే తప్ప.. సిబ్బంది మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తినే తిండికీ కరువొచ్చిందని ఘాజీపూర్ శ్మశానంలో పనిచేసే సునీల్ శర్మ అనే 45 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. గతంలో తమకు వండి పెట్టేందుకు ఓ మనిషి ఉండేవారని, కానీ, ఇప్పుడు వర్క్ లోడ్ పెరగడంతో ఆ వ్యక్తీ శవాల పనే చూసుకుంటున్నాడని తెలిపాడు. తినే టైం కూడా దొరకట్లేదన్నాడు.

ఎవరైనా మద్దతిస్తేనే వ్యాక్సిన్

శ్మశాన వాటికల్లో పనిచేసే చాలా మంది సిబ్బందికి ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేయలేదని వారు వాపోతున్నారు. ఎవరైనా మద్దతిస్తేనే తమకు వ్యాక్సిన్లు వేస్తారని అంటున్నారు. వారి విజ్ఞప్తితో ద గుడ్ ఫుడ్ ప్రాజెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ శ్మశానాల్లో పనిచేసే సిబ్బందికీ ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేసింది.

More Telugu News