బెంగళూరులో 6 వేల మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్

10-05-2021 Mon 13:24
  • తప్పుడు చిరునామాలతో కరోనా టెస్టులు చేయించుకుంటున్న వైనం
  • ఆ తర్వాత పని చేయని ఫోన్ నెంబర్లు
  • మిస్ అయిన వారి కోసం వెతుకుతున్న పోలీసులు
6000 Corona patients missing in Bengaluru

కరోనా సెకండ్ వేవ్ బెంగళూరుపై పంజా విసిరిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా పేషెంట్లతో కోవిడ్ సెంటర్లు, ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు కరోనా వచ్చినవారు ఐసొలేషన్ లో ఉండకుండా బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. చదువుకున్నవారు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బెంగళూరులో సుమారు 6వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. ఈ వార్తతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

గతంలో కూడా దాదాపు 10 వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియలేదు. అయితే కరోనా పరీక్షలకు వచ్చిన వారు తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చారట. ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే... కరోనా సోకిన విషయం వారికి కూడా తెలియకపోవడం. వీరిని వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా... ఏమాత్రం ఫలితం దక్కడం లేదు.