ఇంటిని చక్కబెట్టాల్సిన సమయమొచ్చింది: పార్టీ నేతలకు సోనియా హెచ్చరిక

10-05-2021 Mon 13:10
  • సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ ఓటమిపై చర్చ
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అసహనం
  • వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్రాల నేతలకు ఆదేశం
  • పార్టీకి ఎదురుదెబ్బలపై నిగ్గు తేల్చేందుకు చిన్న కమిటీ
Need To Put House in Order Says Sonia Gandhi

ఇటీవలి ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇంటిని చక్కబెట్టాల్సిన సమయమొచ్చిందని, వరుస ఓటములను పార్టీ నేతలు తీవ్రంగా పరిగణించాలని ఆమె హెచ్చరించారు. ఈరోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆమె పార్టీ ఓటమిపై చర్చించారు.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితేంటో ఆయా రాష్ట్రాల్లోని పార్టీ సీనియర్ నేతలు స్పష్టంగా చెప్పాలని సోనియా సూచించారు. ఆశించిన దాని కన్నా తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన సమయమొచ్చిందని ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయన్నారు.

పార్టీకి తగులుతున్న వరుస ఎదురుదెబ్బలపై విశ్లేషణ చేసేందుకు ఓ చిన్న కమిటీని వేస్తున్నట్టు చెప్పారు. ఓటములకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆ కమిటీ పార్టీకి తెలియజేస్తుందన్నారు. ఇక, కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. పార్టీలో నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరముందని కొందరు నేతలు పోరాడుతున్న నేపథ్యంలో ఎన్నికలపై చర్చించేందుకు నిర్ణయించినట్టు చెబుతున్నారు.