తాత, మనవడుగా నాగ్ .. అఖిల్?

10-05-2021 Mon 10:05
  • 'బంగార్రాజు' ప్రాజెక్టు కదిలినట్టే
  • జులైలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
  • కొడుకు పాత్రలో చైతూ  
Bangarraju Movie Update

నాగార్జున ..  కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో కొంతకాలం క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' విజయాన్ని సాధించింది. నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర జనంలోకి దూకుపోయింది. దాంతో ఆ పాత్ర పేరునే టైటిల్ గా సెట్ చేసి, సీక్వెల్ చేయనున్నట్టు నాగార్జున చెప్పారు. అందుకు సంబంధించిన కథపై దర్శకుడు కల్యాణ్ కృష్ణ కసరత్తు చేస్తూ వచ్చాడు.

అయితే కొన్ని కారణాల వలన ఈ సీక్వెల్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ, ఆలస్యమవుతూ వస్తోంది. మొత్తానికి నాగార్జున ఇక ఈ సినిమాను జులైలో సెట్స్ పైకి తీసుకు వెళ్లవలసిందేనని ఫిక్స్ అయ్యారట. ఆ దిశగానే పనులు మొదలైనట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున కొడుకుగా చైతూ ... ఆయన తనయుడిగా అఖిల్ కనిపిస్తారట. అయితే తెరపై చైతూ కనిపించేది కొంతసేపేనట. కథ అంతా కూడా నాగ్ - అఖిల్ మధ్య నడుస్తుందని అంటున్నారు. అంటే ఈ తండ్రీ కొడుకులు .. తాత మనవలుగా సందడి చేయనున్నారన్న మాట.