ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో ‘7 డేస్‌ 6 నైట్స్‌’

09-05-2021 Sun 21:59
  • పలు హిట్‌ చిత్రాల నిర్మాత ఎం.ఎస్‌.రాజు
  • డర్టీ హరితో దర్శకుడి అవతారం
  • పుట్టిన రోజుని పురస్కరించుకొని రెండో చిత్ర ప్రకటన
  • తనయుడు సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ నిర్మాతలు
MS Raju is directing 7 days 6 nights

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు డర్టీ హరీతో దర్శకుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో అదే ఉత్సాహంతో మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. మే 10న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రానికి ‘7 డేస్‌ 6 నైట్స్‌’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఆయన తనయుడు, నటుడు సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌.రజనీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ఎం.ఎస్‌.రాజు తెలిపారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని వెల్లడించారు. దర్శకుడిగా తన తొలి చిత్రం డర్టీ హరిని మించి ఈ సినిమా ఉంటుందని తెలిపారు. జూన్‌ 7 నుంచి ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సుమంత్‌ అశ్విన్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందించనున్నారు. నాని చమిడిశెట్టి కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు.