రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో పడిన నేపథ్యంలో చైనాపై నాసా ఆగ్రహం

09-05-2021 Sun 21:53
  • అదుపు తప్పిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్
  • తిరుగు ప్రయాణంలో అపశ్రుతి 
  • భూ వాతావరణంలో ప్రవేశించి దగ్ధమైన వైనం
  • మాల్దీవులకు సమీపంలో సముద్రంలో పడిన శకలాలు
  • చైనాది బాధ్యతారాహిత్యమన్న నాసా
NASA slammed China after racket debris collapsed in Indian Ocean

చైనా ప్రయోగించిన ఓ రాకెట్ తిరుగు ప్రయాణంలో నియంత్రణ కోల్పోవడంతో ఆ శకలాలు హిందూ మహాసముద్రంలో మాల్దీవులకు సమీపంలో పడిన సంగతి తెలిసిందే. అవి భూభాగంపై పడి ఉంటే తీవ్ర నష్టం జరిగి ఉండేదన్న నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాలు పాటించడంలో చైనా విఫలమైందని నాసా విమర్శించింది.

నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పందిస్తూ, తమ అంతరిక్ష శకలాలకు సంబంధించి చైనా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని ఆరోపించారు. అంతరిక్ష పరిశోధనలు నిర్వహించే దేశాలు భూమండలంపై ఉండే మానవులకు, ఆస్తులకు నష్టం కలిగించే అవకాశాలను అత్యంత కనిష్ఠానికి తగ్గించాలని హితవు పలికారు. ఇలాంటి పరిణామాలకు సంబంధించి మరింత పారదర్శకతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.