Thai Woman: భారత్ లో కరోనాతో మరణించిన థాయ్ మహిళ... అంత్యక్రియలను కుటుంబసభ్యులకు లైవ్ లో చూపించిన పోలీసులు

  • ఇటీవల భారత్ వచ్చిన థాయ్ మహిళ
  • కరోనాతో ఆసుపత్రిలో చేరిక
  • లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించి మృతి
  • బీజేపీ ఎంపీ కుమారుడిపై ఆరోపణలు
Thai woman dies of corona in Lucknow

ఇటీవల భారత్ వచ్చిన ఓ థాయ్ లాండ్ దేశస్తురాలు లక్నోలో కరోనా చికిత్స పొందుతూ మరణించింది. ఆమె వయసు 41 సంవత్సరాలు. పర్యాటక వీసాపై భారత్ వచ్చిన ఆమె కరోనా బారినపడింది. చికిత్స కోసం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరింది. అయితే పరిస్థితి విషమించడంతో దురదృష్టకర పరిస్థితుల్లో మే 3వ తేదీన కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని థాయ్ లాండ్ తరలించే వీల్లేకపోవడంతో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. దౌత్య కార్యాలయం సహకారంతో థాయ్ లాండ్ లో ఉన్న ఆమె కుటుంబసభ్యులు వీక్షించేలా అంత్యక్రియలను లైవ్ స్ట్రీమింగ్ చేశారు.

ఇదంతా ఒకెత్తయితే... ఆ థాయ్ మహిళ భారత్ ఎందుకు వచ్చిందన్న విషయం రాజకీయ దుమారం రేపడం మరో ఎత్తు. బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్ కుమారుడు ఆ మహిళను 'ఎస్కార్ట్ గాళ్'గా తీసుకువచ్చాడని సమాజ్ వాదీ పార్టీనేత ఐపీ సింగ్ ఆరోపించారు. దాంతో ఎంపీ సంజయ్ సేథ్ స్పందిస్తూ, తన కుమారుడి పేరును ఈ వ్యవహారంలోకి లాగడంపై పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాస్తానని వెల్లడించారు. తన కుమారుడి ప్రమేయంపై ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కోరతానని వివరించారు.

కాగా, ఆమెకు స్థానికంగా ఆశ్రయం అందించిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఫోన్ నెంబరుకు పోలీసులు కాల్ చేయగా, 'డే కేర్ స్పా' అనే మసాజ్ సెంటర్ పేరు డిస్ ప్లేలో కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

More Telugu News