Soumya Swaminathan: భారత్ లో కరోనా విస్ఫోటనం... కారణాలు ఇవేనంటున్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్

  • భారత్ పై కరోనా పంజా
  • నిత్యం 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు
  • వేగంగా వ్యాపిస్తున్న బి.1.617 వేరియంట్
  • అనేక దేశాల్లో హడలెత్తిస్తున్న వైనం
  • భారత్ లోనూ దీని కారణంగానే అత్యధిక కేసులు
  • టీకాలను ఏమార్చే గుణమున్న వేరియంట్
WHO Chief Scientist Soumya Swaminathan opines on corona situations in India

భారత్ లో గత నాలుగు రోజులుగా కరోనా రోజువారీ కేసుల సంఖ్యను గమనిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. నిత్యం 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉద్ధృతంగా ఎందుకు ఉందన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దేశంలో ఇంత వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం బి.1.617 మ్యూటెంట్ అని వివరించారు.

అనేక ఉపశాఖలుగా రూపాంతరం చెందిన ఈ కరోనా మ్యూటెంట్ విభిన్న ఉత్పరివర్తనాలు, లక్షణాలతో భారత్ ను అతలాకుతలం చేస్తోందని తెలిపారు. తొలినాళ్లలో గుర్తించిన కరోనా వైరస్ తో పోల్చితే, అనేక మార్పులకు గురైన బి.1.617 స్ట్రెయిన్ ఒరిజినల్ వైరస్ కంటే ఎంతో ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు. జన్యు ఉత్పరివర్తనాలకు గురైన ఈ కరోనా వేరియంట్ వ్యాక్సిన్లు కల్పించే రక్షణను కూడా ఏమార్చగలదని వివరించారు. భారత్ లోనే కాకుండా బి.1.617 వేరియంట్ ను అమెరికా, బ్రిటన్ లోనూ అత్యంత ప్రభావశీల వైరస్ గా గుర్తించారని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.

అయితే, భారత్ వంటి పెద్ద దేశంలో కరోనా ప్రబలడానికి ఈ వేరియంట్ ఒక్కటే కారణమని భావించలేమని, నిబంధనల ఉల్లంఘన, మాస్కులు ధరించకపోవడం, ప్రజా సమ్మేళనాలు, సభలు, సమావేశాలు వంటివి కూడా కరోనా వ్యాప్తికి దారితీస్తున్నాయని వివరించారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపడుతున్నప్పటికీ, ఇంత పెద్ద దేశంలో వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని, సామాజిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని హితవు పలికారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటికి 2 శాతం మాత్రమే వ్యాక్సిన్లు పొందారని, కనీసం 70, 80 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే అందుకు ఎన్నో నెలలు పడుతుందని అన్నారు.

More Telugu News