ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి భాషకు బెంబేలెత్తిన చైనా దౌత్యవేత్తలు!

09-05-2021 Sun 16:26
  • దక్షిణ చైనా సముద్రంపై చైనా పాగా
  • చైనా ధోరణిని వ్యతిరేకిస్తున్న ఫిలిప్పీన్స్
  • నీకెలా చెప్పాలి చైనా అంటూ ఫిలిప్పీన్స్ మంత్రి బూతులు
  • ఇదేం భాష అంటూ చైనా అభ్యంతరం
  • కనీస దౌత్యభాష వాడితేనే స్పందిస్తామని వెల్లడి
 China diplomats questioned Philippines foreign minister Teodoro Locsin language

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష... అన్నట్టుగా ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి టియోడొరో లోక్సిన్ చైనా దౌత్యవేత్తలు ఉపయోగించే తీవ్ర పదజాలాన్ని తిరిగి వారిపైనే ప్రయోగించాడు. తమ పరుష పదజాలంతో అందరినీ హడలగొట్టే చైనా దౌత్యవేత్తలు ఫిలిప్పీన్స్ మంత్రి వాడిన భాషకు బెంబేలెత్తిపోయారు. చైనాను ఉద్దేశించిన ట్వీట్లలో లోక్సిన్ పలు బూతులు వాడారు. అసలీ మాటల యుద్ధానికి మూలం దక్షిణ చైనా సముద్రంపై నెలకొన్న వివాదం అని చెప్పాలి.

దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యాన్ని సహించని దేశాల్లో ఫిలిప్పీన్స్ కూడా ఒకటి. ఈ క్రమంలో చైనా ఆక్రమణ ధోరణిని నిరసిస్తూ.... చైనా... నా స్నేహితుడా, ఈ విషయాన్ని ఎలా మీ దృష్టికి తీసుకురావాలి? అంటూ ప్రారంభించిన లోక్సిన్ ఆపై బూతుల వర్షం కురిపించారు. తాము స్నేహహస్తం చాచుతుంటే చైనా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. లోక్సిన్ ధాటికి దిమ్మదిరిగిన చైనా... ఆ భాషను మార్చితేనే తాము స్పందిస్తామని బదులిచ్చింది. ఓ కీలక అంశంపై కనీస దౌత్యభాష అవసరమని చైనా దౌత్యవర్గాలు అభిప్రాయపడ్డాయి.

తన భాషపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోక్సిన్ కాస్త విచారం వ్యక్తం చేసినా, తమ వైఖరిలో మాత్రం మార్పులేదని ప్రకటించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి కూడా చైనాపై దౌత్యయుద్ధంలో వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.