గిట్టుబాటు కావడం లేదంటూ గుంతకల్ లో ఇంటివద్దకే బియ్యం వాహనాలను తిరిగిచ్చేసిన ఆపరేటర్లు!

09-05-2021 Sun 16:02
  • ఇంటివద్దకే రేషన్ పథకంలో భాగంగా ఆపరేటర్లకు వాహనాలు
  • వాహనాల నిర్వహణ నిమిత్తం నెలకు రూ.21 వేల చెల్లింపు
  • ఆ మొత్తం సరిపోవడంలేదంటున్న ఆపరేటర్లు
  • గుంతకల్ లో వాహనాలు తిరిగిచ్చేసిన వైనం
Operators returns ration door delivery vehicles

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన పథకం ఇంటివద్దకే రేషన్. అందుకోసం ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి వాహనాలు కేటాయించింది. అయితే ఆ వాహనాల నిర్వహణ తమకు భారంగా మారిందని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన పలువురు ఆపరేటర్లు వాపోయారు. అంతేకాదు, తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో తిరిగిచ్చేశారు. గుంతకల్లులో 20 రేషన్ వాహనాలు ఉండగా, వాటిలో సగం వాహనాలు తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు.

రేషన్ వాహనాల నిర్వహణ నిమిత్తం తమకు ప్రభుత్వం నుంచి రూ.21 వేలు వస్తున్నాయని, కానీ అవి సరిపోవడంలేదని ఆపరేటర్లు చెబుతున్నారు. ఇంధనం, హమాలీ ఖర్చులతో పాటు వాహన ఈఎంఐకే ఆ మొత్తం సరిపోతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి రాయితీ కూడా రావడంలేదని వెల్లడించారు. తమకు ఈ వాహనాలు గిట్టుబాటు కాకపోవడంతో తిరిగిచ్చేశామని వివరించారు.