డబ్బులు కట్టనిదే .. శవాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదు: వైఎస్ ష‌ర్మిల‌

09-05-2021 Sun 13:03
  • తెలంగాణ‌లో కరోనాతో జనం ఆగమైతున్నరు
  • ఆసుప‌త్రి బిల్లుల కోసం ఆస్తులు అమ్ముకొంటున్నరు
  • కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవు
  • అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుంది
sharmila slams kcr

'బ‌తుకులు ఆగ‌మాయె' పేరిట తెలంగాణ‌లోని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని వైఎస్ ష‌ర్మిల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణ‌లో రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఒక్కరైనా కరోనా బారినపడుతున్నారని ఆ క‌థ‌నంలో రాసుకొచ్చారు.

కొన్ని కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు కరోనా కాటుకు బలైపోతున్నారని చెప్పారు. ఆసుప‌త్రులు వేసే లక్షల బిల్లులను కట్టేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని, అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ విష‌యాల‌ను వైఎస్ ష‌ర్మిల ప్ర‌స్తావించారు.

'కరోనాతో జనం ఆగమైతున్నరు.  హాస్పిటల్లో అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకొంటున్నరు. డబ్బులు కట్టనిదే .. శవాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకవైపు ఆస్తులను పోగొట్టుకొని కనీసం ..  దహనసంస్కారాలకు కూడా డబ్బులు లేక, శవాలను సొంతూర్లకు తీసుకపోలేక... ఇక్కడే జరిపిస్తున్న దుస్థితి' అని ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
'కరోనా చావులకన్నా.. అప్పులతో నరకం అనుభవిస్తున్న జనాల సంఖ్య పెరిగిపోతుంది. అయ్యా కేసీఆర్‌ దొర.. దయచేసి ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చండి' అని ష‌ర్మిల డిమాండ్ చేశారు.