లాక్‌డౌన్ మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంది.. దాన్ని మ‌ళ్లీ పొడిగిస్తున్నాం: కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న‌

09-05-2021 Sun 12:34
  • పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి త‌గ్గింది
  • ఈ నెల 17 వ‌ర‌కు లాక్‌డౌన్  పొడిగింపు
  • ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజ‌న్ కొర‌త త‌గ్గింది
  • ఢిల్లీలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది
We used the lockdown period to boost our medical infrastructure Arvind Kejriwal

లాక్‌డౌన్ మంచి ఫ‌లితాల‌ను ఇస్తోందని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... ఢిల్లీలో లాక్‌డౌన్ కార‌ణంగా పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి త‌గ్గిందని తెలిపారు. నిన్న 17,364 కేసులు న‌మోద‌య్యాయ‌ని చెప్పారు.

ఢిల్లీలో మ‌రోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 17 వ‌ర‌కు లాక్‌డౌన్ ఉంటుంద‌ని చెప్పారు. లాక్‌డౌన్ కాలాన్ని తాము వైద్య మౌలిక స‌దుపాయాల‌ను పెంచుకునేందుకు వాడామని తెలిపారు. అలాగే, ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లోని ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ బెడ్ల సంఖ్య‌ను పెంచుకునేందుకు వినియోగించామని అన్నారు.

ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజ‌న్ కొర‌త త‌గ్గిందని చెప్పారు. ఢిల్లీలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోందని వివ‌రించారు. యువ‌కులు చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని వివరించారు. ఢిల్లీలో వ్యాక్సిన్ డోసులు త‌క్కువ‌గా అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ప్ర‌భుత్వం సాయం చేస్తుంద‌ని మేము ఆశిస్తున్నామని చెప్పారు.