'గట్టిగా మొరిగేవాడు.. ఎప్పుడూ కరిచేవాడు కాదు'.. త‌న కుక్క మృతిపై ఒబామా ట్వీట్

09-05-2021 Sun 12:01
  • పెంపుడు శున‌కం 'బో' తో ప్ర‌త్యేక అనుబంధం
  • నమ్మకమైన సహచరుడిని కోల్పోయానన్న ఒబామా
  • ప‌దేళ్ల‌కుపైగా త‌మతోనే 'బో' ఉన్నాడ‌ని వ్యాఖ్య‌
obama dog dies

త‌న పెంపుడు శున‌కం మృతి చెంద‌డంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో భావోద్వేగ‌భ‌రిత పోస్ట్ చేశారు. త‌న‌ నిజమైన స్నేహితుడు, నమ్మకమైన సహచరుడిని కోల్పోయానని అన్నారు. త‌మ‌ కుటుంబం ఓ నమ్మకమైన మిత్రుడిని  కోల్పోయిందని చెప్పారు. త‌మ కుక్క 'బో' ప‌దేళ్ల‌కుపైగా త‌మతోనే ఉంద‌ని తెలిపారు. మంచి, చెడులో మా వెంటే ఉన్నాడని, శ్వేత‌సౌధంలో ఉండే గందరగోళాన్ని అంతా తట్టుకున్నాడని పేర్కొన్నారు.

గట్టిగా మొరిగేవాడు.. అంతేగానీ, ఎప్పుడూ కరిచేవాడు కాదని చెప్పారు. 'బో' వేస‌వి కాలంలో స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి ఇష్టపడేవాడని ఒబామా తెలిపారు. కాగా, పోర్చుగీస్ వాటర్ డాగ్ జాతికి చెందిన ఈ శున‌కాన్ని, 2008 ఎన్నికల్లో ఒబామా ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన సెనేటర్ ఎడ్వర్డ్ ఎం కెన్నెడీ గిఫ్ట్ గా ఇచ్చారు. ఒబామా వ‌ద్ద మ‌రో కుక్క  'సన్నీ కూడా ఉంది.