Kurnool District: కొవిడ్ రోగుల మృతికి కారణమైన కర్నూలు కేఎస్ కేర్ ఆసుపత్రి ఎండీ అరెస్ట్

  • అనుమతి లేకుండా కొవిడ్ రోగులకు చికిత్స
  • రోగుల నుంచి అధిక ఫీజుల వసూలు
  • పరారీలో ఆసుపత్రి డైరెక్టర్
Kurnool KS Care Hospital MD arrested for causing death of Covid patients

అనుమతి లేకుండా ఆసుపత్రిని నిర్వహించడం, నిర్లక్ష్యంగా చికిత్స చేసి కరోనా రోగుల మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై కర్నూలులోని కేఎస్ కేర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ బంగి లాల్‌బహదూర్ శాస్త్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులు మరణించడం ఇటీవల తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు, డీఎంహెచ్ఓ కార్యాలయ అధికారి డాక్టర్ నాగప్రసాద్‌ బాబు తదితరులు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండానే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్టు తేల్చారు.

వారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి మృతికి కారణమయ్యారని నిర్ధారించారు. అలాగే, రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులపై డాక్టర్ నాగప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి ఎండీ లాల్‌బహదూర్‌శాస్త్రిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన ఆసుపత్రి డైరెక్టర్ నర్సింహులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News