ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

08-05-2021 Sat 19:45
  • భారత్ లో కొవిడ్ సంక్షోభం
  • ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలు సతమతం
  • కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
  • 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్
  • ఆదేశాలు జారీ చేసిన చంద్రచూడ్, ఎంఆర్ షా ధర్మాసనం
Supreme Court deploys national task force for oxygen needs

కరోనా మహమ్మారి రెండో విడతలో విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ప్రత్యేక ట్యాంకర్లలో ప్రాణవాయువును రాష్ట్రాలకు తరలిస్తున్నప్పటికీ, అనేక చోట్ల ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. దేశవ్యాప్త ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.

ఆక్సిజన్ అవసరాలను అంచనా వేసి సిఫారసు చేయడం, శాస్త్రీయ పద్ధతిలో మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులకు ప్రత్యేక విధివిధానాలు రూపొందించడం ఈ టాస్క్ ఫోర్స్ విధి. ఈ టాస్క్ ఫోర్స్ లో 12 మంది సభ్యులు ఉంటారు. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఈ టాస్క్ ఫోర్స్ ఎంతో స్వేచ్ఛగా, విశేష అధికారాలతో పనిచేస్తుందని పేర్కొంది. ప్రస్తుత కొవిడ్ సంక్షోభానికి అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థలు శాస్త్రీయ, ప్రత్యేక విజ్ఞానం ఆధారంగా సత్వరమే స్పందించేలా చేయడమే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ప్రధాన హేతువు అని ధర్మాసనం వివరించింది. కాగా, ఈ జాతీయ టాస్క్ ఫోర్స్ పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఉప సంఘాలను (సబ్ టాస్క్ ఫోర్స్)లను కూడా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగి ఉంటుందని వెల్లడించింది.