దర్శకుడు మెహర్ రమేశ్ విజ్ఞప్తికి స్పందించి ఖరీదైన ఔషధాలు పంపించిన సోనూ సూద్

08-05-2021 Sat 19:14
  • పొదుగు వెంకటరమణ అనే వ్యక్తికి కరోనా చికిత్స
  • అత్యవసరంగా మందులు కావాలన్న మెహర్ రమేశ్
  • 24 గంటల్లోపు సమకూర్చిన సోనూ సూద్
  • కృతజ్ఞతలు తెలిపిన మెహర్ రమేశ్
Sonu Sood switf response for Meher Ramesh appeal

కరోనా ఆపత్కాలంలో ప్రత్యక్ష దైవంలా ఆదుకుంటున్న సోనూ సూద్ తన దాతృత్వాన్ని మరింతగా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ విజ్ఞప్తికి స్పందించిన సోనూ సూద్ ఓ కరోనా రోగికి ఖరీదైన ఔషధాలను పంపించారు. హైదరాబాదులో పొదుగు వెంకటరమణ అనే వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడని, అత్యవసర ఔషధాల కోసం తాను ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదని దర్శకుడు మెహర్ రమేశ్ నటుడు సోనూ సూద్ సాయం కోరారు. ఒక టోసిలిజుమాబ్ 400 ఎంజీ ఇంజెక్షన్, ఒక బారిసిటినిబ్ 4ఎంజీ మాత్ర, 3 రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు కావాలని విజ్ఞప్తి చేశారు.

మెహర్ రమేశ్ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సోనూ సూద్ తన ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఔషధాలను పంపించారు. కరోనా చికిత్సలో ప్రాణాధార ఔషధాలుగా భావిస్తున్న ఆ మందులను మెహర్ రమేశ్ వెంటనే రోగికి అందజేశారు. తమ అభ్యర్థనకు వెంటనే స్పందించిన సోనూ సూద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.