మలయాళ బ్యూటీ మళ్లీ బిజీ కానుందా?

08-05-2021 Sat 18:20
  • పలు సినిమాలలో నటించిన మమతా మోహన్ దాస్ 
  • సింగర్ గాను మంచి మార్కులు కొట్టేసింది
  • మలయాళ సినిమాలతో బిజీ
  • తెలుగు నుంచి కూడా వెళుతున్న అవకాశాలు  
Mamatha Mohan Das got chances in tollywood

మమతా మోహన్ దాస్ పేరు వినగానే 'యమదొంగ' సినిమాలో ఆమె పోషించిన ధనలక్ష్మి పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో తాకట్టు వ్యాపారం చేస్తూ హీరోను రెచ్చగొట్టే పాత్రలో ఆమె ఆకట్టుకుంది. ఆ తరువాత వెంకటేశ్ సరసన 'చింతకాయల రవి' .. నాగార్జున జోడీగా 'కింగ్' .. 'కేడీ' సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. మమతా మోహన్ దాస్ మంచి సింగర్ కూడా. తెలుగులో ఆమె పాడిన 'రాఖీ .. రాఖీ' .. 'ఆకలేస్తే అన్నం పెడతా' వంటి పాటలు జనంలోకి బాగా వెళ్లాయి.

ఆ తర్వాత దురదృష్టవశాత్తు మమతా మోహన్ దాస్ కేన్సర్ బారిన పడింది. ఆ తరువాత మనోధైర్యంతో ఆమె ఆ వ్యాధిని జయించింది. అప్పటి నుంచి ఆమె వరుసగా మలయాళ సినిమాలతో బిజీ అయింది. తాజాగా మలయాళంలో ఆమె 'లాల్ భాగ్' అనే సినిమా చేసింది. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లోను ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి కూడా మమతా మోహన్ దాస్ కి అవకాశాలు వెళుతున్నాయట. కీలకమైన పాత్రలకి గాను కొన్ని తెలుగు ప్రాజెక్టులపై ఆమె సైన్ చేయనుందని అంటున్నారు. తెలుగులో మమతా మోహన్ దాస్ మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.