దయచేసి కరోనాను రాజకీయం చేయొద్దు: టీడీపీ నేతలను కోరిన ఏపీ మంత్రి

08-05-2021 Sat 18:12
  • రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు
  • రాష్ట్రంలో పాజిటివ్ కేసుల శాతం తగ్గింది
  • ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
TDP leaders should not politicise Corona says AP minister Chelluboyina

కరోనాను కట్టడి చేయడంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పైగా కర్నూలులో బయటపడిని కొత్త వైరస్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

మరోవైపు, కరోనాపై రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోరారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. వీలైతే ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని సూచించారు. పాజిటివ్ లెక్కల ప్రకారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 44 శాతం నుంచి 35 శాతానికి కరోనా కేసులు తగ్గాయని చెప్పారు. ఆక్సిజన్ కొరత లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. ట్విట్టర్ లో తప్పుడు పోస్టులు చేయడాన్ని నారా లోకేశ్ మానుకోవాని అన్నారు.