జైళ్లలో రద్దీని తగ్గించండి... తప్పనిసరికాని అరెస్టులు వద్దు: కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

08-05-2021 Sat 18:01
  • భారత్ లో కరోనా విశ్వరూపం
  • జైళ్లలోనూ ప్రబలుతున్న మహమ్మారి వైరస్ వ్యాప్తి
  • దేశంలోని జైళ్లలో 4 లక్షల మంది ఖైదీలున్నారన్న సుప్రీం
  • తక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దని సూచన
  • బెయిళ్లు, పెరోళ్లు పొడిగించాలని వెల్లడి
Supreme Court orders on arrests in the wake of corona pandemic

కరోనా సెకండ్ వేవ్ మహోగ్ర రూపుదాల్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో కరోనా మరింత ప్రబలకుండా ఉండేందుకు ఖైదీల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు అరెస్టులు తగ్గించాలని సూచించింది.  

ముఖ్యంగా, తక్కువ శిక్ష పడే కేసుల్లోనూ, ముఖ్యంగా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లోను యాంత్రిక ధోరణిలో అరెస్ట్ చేసుకుంటూ పోయే ధోరణిని విడనాడాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తద్వారా జైళ్లలో రద్దీని నివారించి కరోనా కట్టడికి కృషి చేయాలని తెలిపింది. అర్ణేశ్ కుమార్ కేసులో తీర్పునిస్తూ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

"భారత్ లోని జైళ్లలో 4 లక్షల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. దేశంలో చాలా జైళ్లు క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. ఉండాల్సిన ఖైదీల కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పటి కరోనా పరిస్థితుల్లో అటు ఖైదీల ఆరోగ్యమే కాదు, జైలు సిబ్బంది, పోలీసుల ఆరోగ్యం కూడా ముఖ్యమే" అని బెంచ్ అభిప్రాయపడింది. అంతేకాదు, 2020లో కొవిడ్ విజృంభణ సమయంలో మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన వారికి మళ్లీ బెయిల్ పొడిగించాలని సూచించింది. గతేడాది పెరోల్ పై జైలు నుంచి వెలుపలికి వచ్చినవారికి కూడా పొడిగింపును వర్తింపచేయాలని ఆదేశించింది.

ఖైదీల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా జైలు గోడల మధ్య వైరస్ వ్యాప్తిని నియంత్రించే దిశగా చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. అదే సమయంలో... విడుదలయ్యే అవకాశం ఉన్నా, బయటికి వెళితే కరోనా బారినపడతామని ఆందోళన చెందే ఖైదీలకు తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని, తక్షణ చికిత్సకు ఏర్పాట్లు చేయాలని, ఖైదీలతో పాటు జైలు సిబ్బందికి క్రమం తప్పకుండా టెస్టులు నిర్వహిస్తుండాలని ఈ తీర్పులో వివరించింది.