మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో 'జాతిరత్నాలు' డైరెక్టర్!

08-05-2021 Sat 17:47
  • చిన్న సినిమాగా వచ్చిన 'జాతిరత్నాలు'
  • రికార్డుస్థాయిలో రాబట్టిన వసూళ్లు
  • సీక్వెల్ దిశగా సన్నాహాలు
  • మరో కథపై కూడా కసరత్తు  
Jathi Rathnalu movie director another script work

ఈ ఏడాది కరోనా ఉద్ధృతి పెరగడానికి ముందు థియేటర్స్ లో ఒక రేంజ్ లో సందడి చేసిన సినిమాలలో 'జాతిరత్నాలు' ఒకటి. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ద్వారా 'అనుదీప్' అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవీన్ పోలిశెట్టి .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ కుర్ర డైరెక్టర్ కి డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా అవకాశాలు వస్తున్నాయట.

అయితే 'జాతిరత్నాలు'తో తనకి అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్ కే ఆయన మరో సినిమా చేస్తున్నాడు. ఈ కథ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో నడుస్తుందట. అయితే ఇదేదో పూర్తి యాక్షన్ మూవీ అనుకుంటే పొరపాటే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనరే. ప్రస్తుతం ఈ కథపైనే అనుదీప్ కసరత్తు చేస్తున్నాడట. నాగ్ అశ్విన్ ఎప్పటికప్పుడు కథలో మార్పులు .. చేర్పులు చెబుతున్నాడని అంటున్నారు. ఇక అనుదీప్ దర్శకత్వంలోనే 'జాతిరత్నాలు 2' కూడా రానుంది. మరి ఈ రెండు ప్రాజెక్టులలో దేనిని ముందుగా పట్టాలెక్కిస్తాడో చూడాలి.