ఆర్టికల్ 370పై పాక్ విదేశాంగ మంత్రి నోట ఆశ్చర్యకర వ్యాఖ్యలు

08-05-2021 Sat 14:27
  • ఆర్టికల్ 370 రద్దుపై గతంలో రచ్చ చేసిన పాకిస్థాన్
  • పాక్ ను ఏకాకిని చేయడంలో సఫలీకృతమైన భారత్
  • ఆర్టికల్ 370 భారత్ అంతర్గత వ్యవహారమన్న పాక్ విదేశాంగ మంత్రి
Article 370 is Indias internal matter says Pak external affairs minister Qureshi

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రజలు ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా అండతో పాకిస్థాన్ రెచ్చిపోయే ప్రయత్నం చేసింది. అయితే, భారత దౌత్యం ముందు పాక్ నోర్మూసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఈ విషయంలో భారత్ పై పాక్ ఎన్నో అసత్య ప్రచారాలను చేసే ప్రయత్నం చేసినా... ప్రపంచ దేశాలు పాక్ వాదనను పట్టించుకోలేదు. పాక్ ను ఏకాకిని చేయడంలో భారత్ సఫలీకృతమైంది. తాజాగా పాక్ వైఖరిలో కొంచెం మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. పాక్ విదేశాంగ మంత్రి షా అహ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం భారత్ అంతర్గత వ్యవహారమని ఖురేషీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకప్పుడు ఇదే అంశంపై భారత రాయబారిని ఇస్లామాబాద్ నుంచి పాకిస్థాన్ తిప్పి పంపించింది. ఆర్టికల్ రద్దును భారత సమాజం కూడా హర్షించడం లేదని వ్యాఖ్యానించింది. అలాంటి పరిస్థితి నుంచి పాక్ దిగి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఉగ్రవాదం నేపథ్యంలో పాకిస్థాన్ పలు అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. మరోవైపు ఆ దేశ ప్రతిష్ఠ మంటగలిసింది. దీన్నుంచి గట్టెక్కేందుకే పాక్ తాజాగా మాట మార్చిందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.