రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు.. ఫ్రీ ఫుడ్ కిట్స్ అందజేస్తాం: కేరళ సీఎం విజయన్ కీలక ప్రకటన

08-05-2021 Sat 13:52
  • ఆహారం కోసం ఎవరూ ఇబ్బంది పడొద్దు
  • బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • లాక్ డౌన్ నేపథ్యంలో విజయన్ కీలక ప్రకటన
Keral CM Pinarayi Vijayan announces free food kits for Corona effected families

కరోనాను నిలువరించడంలో యావత్ దేశానికి ఇప్పటికే కేరళ ఆదర్శంగా నిలించింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ మన దేశంలో అడుగుపెట్టినప్పుడు... కేరళలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే, అక్కడి యంత్రాంగం రేయింబవళ్లు కష్టపడి పని చేసి కరోనాను కట్టడి చేసింది. ఆ తర్వాత కేరళ కంటే ఎక్కువగా ఎన్నో రాష్ట్రాలు కరోనాతో అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుత సెకండ్ వేవ్ సమయంలో కూడా కేరళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతుంటే... కేరళ మాత్రం ఫస్ట్ వేవ్ నేర్పిన గుణపాఠంతో ఆక్సిజన్ సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది.

మరోవైపు, ఈరోజు కేరళ సీఎం కీలక ప్రకటన చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పటికే కేరళలో 8 రోజుల పూర్తి లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్లు అందరికీ ఫుడ్ కిట్స్ ను ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తామని సీఎం విజయన్ ప్రకటించారు. సెకండ్ వేవ్ చాలా బలంగా ఉందని... అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆహారం కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.

కేరళ విధించిన కొత్త కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రంలోని ఆహారం, నిత్యావసరాలు, పళ్లు, కాయగూరలు, డెయిరీ ప్రాడక్ట్స్, మాంసం, చేపలు, జంతువుల దాణా, పౌల్ట్రీ, బేకరీలు తెరిచే ఉంటాయి. అయితే అన్ని షాపులు సాయంత్రం 7.30 కల్లా బంద్ చేయాల్సి ఉంటుంది.

సీఎం పినరయి విజయన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని చెప్పారు. అన్ని బాధిత కుటుంబాలకు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచిత ఫుడ్ కిట్స్ అందిస్తామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ సంస్థలు, ప్రజా రెస్టారెంట్లు, కమ్యూనిటీ కిచెన్స్ ద్వారా ఆహారాన్ని అందజేస్తామని చెప్పారు.