త్వ‌ర‌లో జో బైడెన్‌, పుతిన్ స‌మావేశం?

08-05-2021 Sat 12:43
  • సంకేతాలు ఇచ్చిన బైడెన్
  • ఇంకా ఖ‌రారు కాని సమయం, స్థలం
  • స‌మావేశం కోసం కొన‌సాగుతోన్న చ‌ర్చ‌లు
Joe Biden says confident of meeting Putin

అమెరికా-రష్యా దేశాల అధ్య‌క్షులు త్వ‌ర‌లోనే స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జూన్‌లో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ సమావేశమవుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జో బైడెన్‌ను తాజాగా ఓ విలేక‌రి ఈ విష‌యంపై ప్ర‌శ్నించారు.

దీనికి బైడెన్ స‌మాధానం చెబుతూ... ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల విష‌యంలో  ముందడుగు పడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పారు. పుతిన్‌తో తాను త్వరలోనే సమావేశం అవుతున్నాన‌ని భావిస్తున్నాట్లు తెలిపారు. త‌మ స‌మావేశానికి సమయం, స్థలం ఖ‌రారు ఇంకా కాలేద‌ని చెప్పారు. వీటిపై చర్చలు జరుగుతున్నాయ‌ని అన్నారు.

మరోపక్క, ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో రష్యా తన సైన్యాన్ని మోహరించింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. అయిన‌ప్ప‌టికీ, పుతిన్‌తో సమావేశమవ్వాలన్న త‌మ నిర్ణ‌యంలో మార్పు ఉండదని బైడెన్ స్ప‌ష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఇంతకుముందు ర‌ష్యా దళాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు దళాలను ఉపసంహరించుకున్నారని చెప్పారు.

కాగా, ఇరు దేశాల అధినేత‌లు స‌మావేశం అయ్యేందుకు తేదీ, సమయం, ఎజెండాల ఖ‌రారుపై చర్చలు జరుగుతున్నట్లు  వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ  తెలిపారు. ప‌లు అంశాల్లో ఇరు దేశాల మ‌ధ్య ఏకాభిప్రాయం లేద‌ని, బైడెన్, పుతిన్ స‌మావేశానికి ముందు వాటిని పరిష్కరించుకోవాల్సిన‌ అవసరం కూడా లేదని చెప్పారు. కాగా, ఉక్రెయిన్ అంశంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘ‌న‌, సైబర్ భ‌ద్ర‌త‌ వంటివాటిపై రష్యా, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు కొన‌సాగుతున్నాయి.