పెళ్లిలో భోజనాలతో పాటు 'కరోనా' కూడా వడ్డించేశాడు!

08-05-2021 Sat 12:21
  • గత నెల 27న అరుణ్ మిశ్రా అనే వ్యక్తికి కరోనా పాజిటివ్
  • తన స్నేహితులతో కలిసి పెళ్లికి వెళ్లిన వైనం
  • విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు
Corona patient spreads virus in a marriage

ఓవైపు కరోనా వైరస్ కోరలు చాస్తుంటే... మరోవైపు కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ, ఇతరులకు కరోనా అంటుకోవడానికి కారకులవుతున్నారు. కరోనా బారిన పడిన కొందరు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకోకుండా... జనాల మధ్య తిరుగుతున్నారు. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఒక వ్యక్తి చేసిన పనికి ఎంతో మంది కరోనా బారిన పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే అరుణ్ మిశ్రా అనే వ్యక్తి ఓ పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లికి పోయినవాడు ఓ మూలన కూర్చుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు వడ్డించాడు. పాపం.. విందు భోజనం బాగుందని లొట్టలేసుకుంటూ తిన్నవారికి అప్పుడు తెలియదు.. మహానుభావుడు భోజనంతో పాటు కరోనా కూడా వడ్డించాడని.

పెళ్లి తతంగం తర్వాత ఆ ఊరిలో కరోనా కేసులు అమాంతం పెరిగాయి. ఇలా ఎందుకు జరిగిందా అని అధికారులు ఆరా తీస్తే... మొత్తం విషయం వెలుగులోకి  వచ్చింది. గత నెల 27న అరుణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కరోనా ఉన్నా తన మరో ఇద్దరు స్నేహితులను కూడా పెళ్లికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అరుణ్ తో పాటు, అతని ఇద్దరి స్నేహితులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అరుణ్, అతని స్నేహితుడొకరు కోవిడ్ సెంటర్ లో ఉన్నారు. మరో స్నేహితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.