ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం త‌ప్పా?: అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం

08-05-2021 Sat 11:56
  • సజ్జల రామకృష్ణారెడ్డి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు
  • అస‌లు ఆయ‌న‌ స్థాయి ఏంటీ?
  • ఆయ‌న‌కు సంబంధం ఏంటీ?
  • జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాక‌పోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్క‌డ ఉండేవారు?  
atchennaidu slams jagan ycp

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీలో వ్యాక్సినేష‌న్ స‌మ‌స్య‌లు, ఆక్సిజ‌న్ కొర‌త, క‌రోనా రోగుల‌కు సౌక‌ర్యాలు వంటి అంశాలపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌భుత్వానికి తాము స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం త‌ప్పా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తాము స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటే, స్వీకరించకుండా త‌మపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారని ఆయ‌న మండిపడ్డారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడ‌డం ముఖ్య‌మని, అంతేగానీ, రాజ‌కీయాలు కాద‌ని తెలిపారు. వైసీపీ నేత‌ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్ర‌బాబుపైనే విమ‌ర్శ‌లు గుప్పించే అంత‌టి వాడా? అని అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'సజ్జల రామకృష్ణారెడ్డి, అస‌లు నీ స్థాయి ఏంటీ? అస‌లు నీకు సంబంధం ఏంటీ? ఒక‌వేళ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాక‌పోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్క‌డ ఉండేవారు? చంద్ర‌బాబుకి ఏమీ తెలియ‌ద‌ని, అవ‌గాహన లేద‌ని ఆయ‌న మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ గురించి అడిగితే కేంద్ర స‌ర్కారుని అడ‌గాల‌ని ఆయ‌న అంటున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సిన్ కొనుక్కోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా చెప్పింది. ఈ విష‌యం స‌జ్జ‌ల‌కు తెలియ‌దా?' అని అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'మ‌హారాష్ట్ర, గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం లేఖ‌లు రాసి డ‌బ్బులు ఇస్తామ‌ని, వెంట‌నే వ్యాక్సిన్లు పంపాల‌ని కోరాయి. కానీ, ఏపీ ప్ర‌భుత్వం మాత్రం మొద్దు నిద్ర‌పోతోంది. అంతేగాక‌, సూచ‌న‌లు చేస్తోన్న వారిపై విమ‌ర్శ‌లు చేస్తారా?' అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. క‌రోనా విజృంభిస్తుంటే దాన్ని ప‌ట్టించుకోకుండా, అమ్మఒడి అంటూ.. ఇంకో ప‌థ‌కం అంటూ ఇప్పుడు అవ‌స‌రం లేని వాటిపై దృష్టి పెడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.