Andhra Pradesh: రాజమండ్రిలో కొన్ని క్షణాలపాటు మాయమైన నీడ!

  • ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టిన ప్రజలు
  • ఏడాదికి రెండుసార్లు ఇలాంటివి కనిపిస్తాయన్న భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు
  • సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడడమే కారణం
  • ఆగస్టు 5న మరోసారి ఈ దృశ్యం కనిపిస్తుందన్న గుర్రయ్య
Sun Shadow missing for a while in rajahmundry

రాజమండ్రిలో నిన్న కొన్ని క్షణాలపాటు నీడ మాయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా మనల్ని నిత్యం వెంటాడేది నీడ ఒక్కటే. అలాగే, ఎండలో ఉండే వస్తువులకు కూడా నీడ ఉంటుంది. ఆ సమయంలో సూర్యుడు ఉన్న దిశను బట్టి నీడ భూమిపై పడుతుంది. కానీ నిన్న రాజమండ్రిలో ఎర్రటి ఎండ కాసినా కాసేపు నీడ మాయమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ విచిత్రం జరిగింది. నీడ జాడ లేకపోవడంతో జనం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.

నిన్న కొన్ని క్షణాలపాటు నీడ మాయం కావడంపై రాజమండ్రిలోని శ్రీసత్యసాయి గురుకులం వైస్ ప్రిన్సిపాల్ అయిన భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతికశాఖ అనుబంధ సంస్థ వీఐపీఎన్‌ఈటీ సమన్వయకర్త గుర్రయ్య మాట్లాడుతూ నీడ కనిపించకపోవడానికి గల కారణాలు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయన్నారు.

ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాల్లో ఏడాదికి రెండుసార్లు ఇలాంటి  ఘటనలు కనిపిస్తుంటాయన్నారు. ఆ సమయాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని చేరుతాయని అందువల్లే నీడ కనిపించదని అన్నారు. సూర్యుడు ఉత్తర, దక్షిణ దిశగా పయనిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయని, ఈ ఏడాది ఆగస్టు 5న కూడా ఇక్కడ ఇలాంటి దృశ్యమే కనిపిస్తుందని గుర్రయ్య వివరించారు.

More Telugu News