తెలంగాణలో మే 12 వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు లేనట్టే!

07-05-2021 Fri 21:52
  • దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్
  • కొనసాగుతున్న 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్
  • పెద్ద సంఖ్యలో రెండో డోసు తీసుకోవాల్సిన వ్యక్తులు
  • టీకాలకు విపరీతమైన డిమాండ్
No corona vaccine first dose until second dose recipients completed

దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటన చేసినా, అది వాస్తవరూపం దాల్చడంలేదు. అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడమే అందుకు కారణం. 45 ఏళ్లకు పైబడిన వారిలో తొలి డోసు తీసుకున్నవారిలో చాలామందికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. టీకాలకు తీవ్రమైన కొరత ఉండడంతో రెండోడోసుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతలోనే కేంద్రం 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా అందించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. మే 12 వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇవ్వలేమని, రెండో డోసు తీసుకోవాల్సిన వారికే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు ఆ మేరకు సర్టిఫికెట్ చూపిస్తే రెండో డోసు వేస్తామని, ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రెండో డోసు అందజేస్తామని వెల్లడించింది.