కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్... ఈ నెల 10 నుంచి అమలు

07-05-2021 Fri 20:11
  • కర్ణాటకలో కరోనా బీభత్సం
  • నిన్న 49 వేలకు పైగా పాజిటివ్ కేసులు
  • బెంగళూరులోనూ కరోనా ఘంటికలు
  • కఠిన నిర్ణయం తీసుకున్న సీఎం యడియూరప్ప
  • ఈ నెల 24 వరకు లాక్ డౌన్
Complete Lock Down in Karnataka

కొవిడ్ దెబ్బకు అతలాకుతలం అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. గురువారం ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 49,058 పాజిటివ్ కేసులు వచ్చాయి. కేవలం బెంగళూరు మహానగరంలోనే 23 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి విశృంఖలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.

ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం యడియూరప్ప వెల్లడించారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కరిని కూడా బయటకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అన్ని హోటళ్లు, పబ్ లు, బార్లు మూసివేయాలని అన్నారు. ఫలహార శాలలు, మాంసం దుకాణాలు, కూరగాయల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అనుమతిస్తారని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల, అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తుండడంతో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యడియూరప్ప వివరణ ఇచ్చారు. అయితే, ఇది తాత్కాలిక లాక్ డౌన్ మాత్రమేనని, వలస కూలీలు తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.