Team India: వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు భారత జట్టు ఎంపిక

  • జూన్ 18 నుంచి టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్
  • ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా మ్యాచ్
  • టెస్టు చాంపియన్ ఫైనల్లో భారత్, కివీస్ అమీతుమీ
  • అనంతరం ఇంగ్లండ్ తో భారత్ 5 టెస్టుల సిరీస్
Team India announced for world test championship finals against New Zealand

జూన్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో తలపడనుంది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ టెస్టు సమరానికి వేదిక. ఈ మ్యాచ్ లో ఆడే టీమిండియాను నేడు ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో మొత్తం 20 మందితో జట్టును ప్రకటించారు. ఇదే జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తో పాటు, ఇంగ్లండ్ జట్టుతో జరిగే 5 టెస్టుల సిరీస్ లోనూ ఆడనుంది.

హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ లకు జట్టులో స్థానం దక్కలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న పృథ్వీ షాను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఇక, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహాలకు జట్టులో స్థానం లభించినా, వారిద్దరూ ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే ఇంగ్లండ్ పయనమవుతారు. కేఎల్ రాహుల్ కు ఇటీవల అపెండిసైటిస్ కు శస్త్రచికిత్స జరగ్గా, సాహా కరోనా బారినపడ్డాడు.

టీమిండియా సభ్యుల వివరాలు...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా.

స్టాండ్ బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జన్ నగ్వాస్ వాలా.

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్- జూన్ 18 నుంచి 22 వరకు.
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్- ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు.

More Telugu News