త్రివిక్రమ్ మూవీ కోసం మహేశ్ భారీ పారితోషికం?

07-05-2021 Fri 18:53
  • త్రివిక్రమ్ తో మహేశ్ మూడో సినిమా
  • కరోనా ఉద్ధృతి తగ్గగానే సెట్స్ పైకి
  • పారితోషికాల విషయమే హాట్ టాపిక్  
Mahesh Babu huge remuneration for Trivikram movie

త్రివిక్రమ్ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు అంటేనే, అభిమానుల్లో అంచనాలు మొదలైపోతాయి. అందుకు కారణం ఆయన ఇప్పటివరకూ తీసిన సినిమాలు .. అవి సాధించిన విజయాలు. త్రివిక్రమ్ సినిమాల్లో కథాకథనాలు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేవిగా .. ఆకట్టుకునేలా ఉంటాయి. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. దర్శకత్వం ఇలా ఈ నాలుగింటిపై ఆయన ఒక యజ్ఞమే చేస్తాడు. అందువలన ఆయన అందుకునే పారితోషికం భారీగానే ఉంటుంది. అయితే ఈ సారి ఆయన పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా అందుకోనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక మహేశ్ బాబు విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్టుకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన భారీ పారితోషికం తీసుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి రావడమే మహేశ్ పారితోషికం పెరగడానికి కారణమై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.