సీక్వెల్ దిశగా 'వకీల్ సాబ్'?

07-05-2021 Fri 17:47
  • 'వకీల్ సాబ్'తో సూపర్ హిట్
  • సీక్వెల్ పై అభిమానుల ఆసక్తి
  • తాను సిద్ధమంటున్న వేణు శ్రీరామ్  
Sequel of Vakeel Saab

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' తెరకెక్కింది. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బలమైన కథాకథనాలకు పవన్ క్రేజ్ తోడు కావడంతో ఈ సినిమా అనూహ్యమైన స్థాయిలో దూసుకుపోయింది. రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వేణు శ్రీరామ్ మాటలు విన్న తరువాత ఈ విషయంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.

'వకీల్ సాబ్' సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అంతకు ముందు మాకు సీక్వెల్ ఆలోచన లేదు. కానీ అభిమానులు బలంగా కోరుకుంటూ ఉండటంతో ఒక ఆలోచన రేకెత్తుతోంది. పవన్ కల్యాణ్ గారు ఓకే అంటే .. దిల్ రాజు గారు ఒప్పుకుంటే సీక్వెల్ చేయవచ్చు' అని ఆయన అన్నారు. అంటే మరో కేసుతో 'వకీల్ సాబ్' మళ్లీ రంగంలోకి దిగుతాడన్న మాట. దిల్ రాజు అడ్వాన్స్ పవన్ దగ్గర ఉంది ... వాళ్లిద్దరూ ఓకే అంటే తాను రెడీ అంటున్నాడు వేణు శ్రీరామ్. కనుక 'వకీల్ సాబ్ 2'కి అవకాశాలు ఉన్నాయనే అనుకోవాలి.