Jagan: ఇలాంటి రాజకీయాలు వద్దు... ప్రధానికి మనమంతా మద్దతు ఇవ్వాలి: ఝార్ఖండ్ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హితవు

  • ప్రధాని మోదీ తనతో మాట్లాడారన్న ఝార్ఖండ్ సీఎం
  • తాను చెప్పేది వినిపించుకోలేదన్న హేమంత్ సొరేన్
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం జగన్
  • విభేదాలను పక్కనబెట్టాలని సూచన
  • కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు
AP CM Jagan responds to Jharkhand  CM Hemant Soren comments on PM Modi

నిన్న ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. గౌరవనీయ ప్రధానమంత్రి తనతో మాట్లాడారని, కానీ ఆయన ఏమనుకుంటున్నారో అదే చెప్పారు తప్ప, తన మాటలేవీ ఆయన వినిపించుకోలేదని సోరేన్ వాపోయారు. కరోనా కష్టకాలంలో ఏంచేయాలో దాని గురించి మాట్లాడితే బాగుండేదని, తాము తీసుకుంటున్న చర్యల గురించి వింటే సంతృప్తికరంగా ఉండేదన్నారు. అయితే, ఊహించని విధంగా హేమంత్ సొరేన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ట్వీట్ ద్వారా స్పందించారు.

"డియర్ హేమంత్ సొరేన్... మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరేదేమిటంటే... మనమధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో ఒకరిని వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు" అని సీఎం జగన్ హితవు పలికారు.

More Telugu News