మెడికల్ ఆక్సిజన్ మరింత కావాలి... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ

07-05-2021 Fri 14:23
  • బెంగాల్ లో కరోనా విజృంభణ
  • అత్యధిక కేసుల్లో ఆక్సిజన్ అవసరం
  • రోజుకు 470 మెట్రిక్ టన్నులు వినియోగమవుతోందని వెల్లడి
  • రాబోయే రోజుల్లో 550 మెట్రిక్ టన్నులు కావాలన్న మమత 
Mamata Banarjee writes PM Modi seeking more medical oxygen for West Bengal

కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ వినియోగానికి అత్యధిక డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, అవసరాలకు తగినంత ప్రాణవాయువు సరఫరా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఆక్సిజన్ సరఫరా క్లిష్ట సమస్యలా మారిందన్న విషయాన్ని లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నానని మమత పేర్కొన్నారు.

"ఈ నెల 5వ తేదీన రాసిన లేఖలో కూడా రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కోసం డిమాండ్ మరింత పెరిగిన అంశాన్ని ప్రస్తావించాను. రాష్ట్రంలో కొవిడ్ కేసులు అధికం అవుతుంటే, చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ మాత్రం చాలడంలేదు. గత 24 గంటల వ్యవధిలో బెంగాల్ లో 470 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉపయోగించారు. రాబోయే ఏడెనిమిది రోజుల్లో అది 550 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని భావిస్తున్నాం.

ఇదే అంశాన్ని మా చీఫ్ సెక్రటరీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. పశ్చిమ బెంగాల్ కు రోజుకు 550 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అత్యవసరంగా కావాలని అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం మాత్రం పశ్చిమ బెంగాల్ కు మొండిచేయి చూపిస్తూ, ఇతర రాష్ట్రాలకు మాత్రం అత్యధికంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇకనైనా స్పందించి బెంగాల్ కు రోజుకు 550 మెట్రిక్ టన్నులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి" అని మమత తన లేఖలో డిమాండ్ చేశారు.