అమెరికా పాఠ‌శాల‌లో కాల్పులు జ‌రిపిన ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని

07-05-2021 Fri 11:08
  • ఇదాహో రాష్ట్రంలో ఘ‌ట‌న‌
  • ఇద్దరు విద్యార్థులు, స్కూల్ సిబ్బందికి గాయాలు
  • బాలిక‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
girl opens fire at school

ఆరో త‌ర‌గ‌తి విద్యార్థిని తాను చ‌దువుతోన్న‌ పాఠ‌శాల‌లో తుపాకీతో కాల్పులు జ‌రిపి అల‌జ‌డి రేపింది. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇదాహో రాష్ట్రంలోని ఓ పాఠశాలలో రిగ్బి మిడిల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక‌ బడికి వ‌చ్చే స‌మ‌యంలోనే ఓ తుపాకీని త‌న వెంట తెచ్చుకుంది.

పాఠ‌శాల‌లో విచక్షణ రహితంగా కాల్పులకు తెగ‌బ‌డ‌డంతో ఇద్దరు విద్యార్థులు, స్కూల్ సిబ్బందికి ఒకరికి గాయాల‌య్యాయి. దీంతో  వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించిన సిబ్బంది చికిత్స అందేలా చేయ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వారు ముగ్గురూ కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. కాల్పులు జ‌రిపిన బాలిక‌ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి కార‌ణంగా త‌రుచూ కాల్పుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు పాఠ‌శాల‌లో చ‌దివే బాలిక‌ కూడా తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌డం క‌ల‌క‌లం రేపుతోంది.