ఉత్కంఠను రేకెత్తించే కొత్త కథతో సందీప్ కిషన్!

07-05-2021 Fri 10:55
  • వీఐ ఆనంద్ తో సందీప్ కిషన్
  • గతంలో 'టైగర్'తో లభించిన హిట్
  • ఈ సారి కొత్త కాన్సెప్ట్ తో ప్రయోగం
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్  
VI Anand new movie with Sundeep Kishan

మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అప్పుడప్పుడు అపజయాలు పలకరించినా, కొత్తదనం నుంచి మాత్రం ఆయన దూరంగా వెళ్లడం లేదు. ఇటీవల వచ్చిన 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా ఆయనకు మంచి సంతృప్తిని ఇచ్చింది. ఒక మంచి ప్రయత్నం అని అభిమానులతో అనిపించుకున్నాడు. ఇక ఆయన తాజా చిత్రంగా 'గల్లీ రౌడీ' రానుంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. కామెడీ పాళ్లు ఎక్కువ కలిసిన ఈ యాక్షన్ సినిమాపై ఆయన గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు.

ఆ తరువాత సినిమాను సందీప్ కిషన్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, రాజేశ్ దందా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టు పోస్టర్ ను విడుదల చేశారు. గతంలో వీఐ ఆనంద్ - సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన 'టైగర్' సినిమా హిట్ అయింది. మరి కొత్త కాన్సెప్ట్ తో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.