మహేంద్రన్ ఒక ద్రోహి: కమలహాసన్ మండిపాటు

07-05-2021 Fri 10:52
  • ఎన్నికల సంగ్రామంలో మా పార్టీ వీరోచితంగా పోరాడింది
  • పార్టీలోనే శత్రువులు ఉన్నారు
  • ఇప్పుడు పార్టీకి మంచి రోజులు వచ్చాయి
Mahendran is aTraitor Says Kamal Haasan

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కు చెందిన మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది. దీంతో ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆయన విమర్శించారు.

ఈ నేపథ్యంలో ఆయనపై కమల్ మండిపడ్డారు. మహేంద్రన్ ఒక ద్రోహి అంటూ  దుయ్యబట్టారు. ఎన్నికల సంగ్రామంలో తమ పార్టీ వీరోచితంగా పోరాడిందని కమల్ అన్నారు. అయితే తమకు శత్రువులతో పాటు పార్టీలోనే ద్రోహులు కూడా ఉన్నారని మండిపడ్డారు. ఈ ద్రోహులలో మహేంద్రన్ ముందు వరుసలో ఉంటారని చెప్పారు.

వీళ్లందరినీ పార్టీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పార్టీలో వినిపిస్తున్నాయని... తనపై వేటు పడుతుందని భావించి, చాలా తెలివిగా ఆయన పార్టీ నుంచి తనంతట తానుగా తప్పుకున్నారని అన్నారు. తన జీవితంలో తాను ఎప్పుడూ పారదర్శకంగానే ఉన్నానని చెప్పారు. పార్టీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని... ఎన్నికల ఫలితాలను చూసి పార్టీ కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు.