Andhra Pradesh: ఏపీ అభ్యర్థనకు కేంద్రం నో.. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేయాల్సిందేనని స్పష్టీకరణ

Central Government Rejects AP Request On Vaccination
  • 18 ఏళ్లు పైబడిన వారి కోసం 13 లక్షల వ్యాక్సిన్లు కేటాయించిన కేంద్రం
  • వాటిని 45 ఏళ్లు పైబడిన వారికి వేస్తామన్న ఏపీ
  • మూడో వేవ్‌ను తట్టుకునేందుకు ఆసుపత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్న సింఘాల్
18 ఏళ్లు పైబడిన వారి కోసం కేటాయించిన టీకాలను 45 ఏళ్లు పైబడిన వారికి వేసేందుకు అనుమతి ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 13 లక్షల వ్యాక్సిన్లు కేటాయించింది. ఈ టీకాలను తొలుత 45 ఏళ్ల దాటిన వారికి ఇస్తామని, అలా ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

అయితే, ఇందుకు కేంద్రం నో చెప్పింది. తాము కేటాయించిన వారికే వ్యాక్సిన్లు ఇవ్వాలని స్పష్టం చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గత రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు కేటాయించిన వ్యాక్సిన్లు కాకుండా మరో 3.5 లక్షల వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇందుకోసం అడ్వాన్సు కింద అవసరమైన నిధులను విడుదల చేసినట్టు చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కోటాను పెంచాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని సింఘాల్ తెలిపారు. అవసరానికి తగ్గట్టుగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కేటాయింపులు లేవన్నారు. మూడో వేవ్ వచ్చినా ఆక్సిజన్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రులలో ‘పీఎస్ఏ’ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని సింఘాల్ వివరించారు.
Andhra Pradesh
Corona Virus
Vaccination

More Telugu News