cricket: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌తో చరిత్ర సృష్టించిన రిషభ్‌ పంత్‌!

  • ఐసీసీ అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఆరోస్థానం
  • ఈ ఘనత సాధించిన తొలి భారత కీపర్‌
  • మధ్యలో ఫామ్‌లేక తీవ్ర ఇబ్బందులు
  • ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో సిరీసుల్లో అద్భుత ప్రదర్శన
Rishabh panth has created a history

భారత క్రికెట్‌ యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ 10 మంది బ్యాట్స్‌మన్‌ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌ పంతే కావడం విశేషం. కొంత కాలం పాటు ఫామ్‌లో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాట్స్‌మెన్‌ ఇటీవల జరిగిన టెస్టు క్రికెట్‌ మ్యాచుల్లో తనదైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పంత్‌ చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా టెస్టు జట్టుకు ఎంపిక చేయగా.. తనదైన ప్రదర్శన కనబరిచి అందరినీ ఆకట్టుకున్నాడు. అలా భారత్‌ క్రికెట్‌ టీం బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారత్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రాణించాడు. ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ కొట్టి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్‌ టీం వరుసగా రెండో సిరీస్‌ నెగ్గింది. పంత్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు.

More Telugu News