ఈటలతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి భేటీ!

06-05-2021 Thu 21:01
  • రాజకీయాలు చర్చించలేదన్న మాజీ ఎంపీ
  • ఈటల భార్య జమున తమ బంధువని తెలిపిన కొండా
  • ఆ సానుభూతితోనే కలిశానని వెల్లడి
  • ఈటల అవమానంగా ఫీల్‌ కావాల్సిన అవసరం లేదన్న కొండా
  • కేసీఆర్ తప్పుడు నిర్ణయాల్లో ఇదొకటని వ్యాఖ్య
Konda vishweshwar reddy met with eetaea

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మేడ్చల్‌లోని ఈటల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వీరిరువురు పార్టీ పెట్టనున్నారని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాత్రం ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలేమీ లేవని తెలిపారు. ఈటల భార్య జమున తమకు బంధువని, ఈ నేపథ్యంలో కేవలం సానుభూతితో మాత్రమే ఆయనను కలవడానికి వచ్చానన్నారు. తాము చాలా కాలం నుంచి మిత్రులమని.. కొన్ని పాత విషయాలు గుర్తుచేసుకున్నామన్నారు.

ఈటల తప్పేమీ చేయలేదని, అవమానానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. వాటిలో ఇదొకటని కొండా అభిప్రాయపడ్డారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ సమాజం ఆయన వెనుక ఉంటుందని విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు.