బీజేపీకి ఓట్లు వచ్చిన చోటే హింస చోటుచేసుకుంటోంది: మమతా బెనర్జీ

06-05-2021 Thu 19:04
  • ఎన్నికల తర్వాత బెంగాల్ లో చెలరేగుతున్న హింస
  • ప్రజాతీర్పును బీజేపీ నేతలు స్వీకరించలేకపోతున్నారు
  • కొందరు కేంద్ర మంత్రులు హింసను రాజేస్తున్నారు
Violence is taking place where the BJP got votes says Mamata Banerjee

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హింసపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించడంపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో టీఎంసీ గెలిచి 24 గంటలు కూడా గడవలేదని.. అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి కేంద్రం టీములను పంపిస్తోందని చెప్పారు. ఎంతోమంది బయటి నుంచి రాష్ట్రానికి వస్తున్నారని... కొందరు స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా కూడా వస్తున్నారని... ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను చేయిస్తున్నామని తెలిపారు.

తాజాగా చెలరేగిన హింసలో చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్టు మమత చెప్పారు. బెంగాల్ హింసకు బీజేపీనే కారణమని... ఎన్నికల తర్వాత కూడా కొందరు కేంద్ర మంత్రులు హింసను రాజేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాతీర్పును బీజేపీ నేతలు స్వీకరించలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీకి ఓట్లు ఎక్కువగా వచ్చిన ప్రాంతాల్లోనే హింస చోటు చేసుకుంటోందని చెప్పారు.