బాలకృష్ణ జోడీగా సందడి చేయనున్న శ్రుతిహాసన్?

06-05-2021 Thu 17:13
  • గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
  • కథానాయిక పరిశీలనలో శ్రుతిహాసన్ పేరు
  • గోపీచంద్ మలినేనితో శ్రుతిహాసన్ కి మూడో సినిమా
Sruthi Haasan with Balakrishna in Gopichand Malineni movie

తెలుగు తెరకి నాజూకు అందాలను పరిచయం చేసినవారిలో శ్రుతిహాసన్ ఒకరు. చాలా తక్కువ కాలంలోనే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. పూతరేకులాంటి ఈ పిల్ల కుర్రాళ్ల కలలరాణిగా వెలిగిపోయింది. అయితే తెలుగులో కెరియర్ మాంఛి జోరుమీద ఉండగా ఆమె బాలీవుడ్ వైపు పరుగులు తీసింది. ఆ సమయంలోనే ఆమె ప్రేమలో పడి కెరియర్ ను నిర్లక్ష్యం చేసింది. తీరా ఆమె కళ్లు తెరిచేసరికి కొత్తగా చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చేశారు. కానీ అదృష్టం కొద్దీ ఆమెకి రీ ఎంట్రీలో 'క్రాక్' వంటి సూపర్ హిట్ పడింది. దాంతో ఆమె కెరియర్ మళ్లీ దార్లో పడింది.

అలాంటి శ్రుతిహాసన్ పేరు ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించి వినిపిస్తోంది. బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపైన గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఒక పాత్రకి జోడీగా శ్రుతిహాసన్ ను అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'బలుపు' సినిమా నుంచి శ్రుతిహాసన్ తో గోపీచంద్ మలినేనికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఆమె ఉంటే తన సినిమా హిట్టేననే సెంటిమెంట్ ను 'క్రాక్' బలపరిచింది. అందువలన ఆమెను తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఉన్నాడని చెప్పుకుంటున్నారు.