ఎయిర్ అంబులెన్స్ ద్వారా 'చెన్నై సూపర్ కింగ్స్' బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ ల తరలింపు

06-05-2021 Thu 17:02
  • కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఐపీఎల్
  • చెన్నై జట్టు సహాయక సిబ్బందికి కరోనా
  • మైఖేల్ హసీ, బాలాజీలకు కరోనా పాజిటివ్
  • చెన్నైలో మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయగలమన్న ఫ్రాంచైజీ
CSK coaches Michael Hussey and Balaji airlifted to Chennai

ఐపీఎల్ లో వెల్లడైన కరోనా కేసులు టోర్నీ నిలిపివేతకు కారణమైన సంగతి తెలిసిందే. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హసీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలకు పాజిటివ్ వచ్చింది. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించిన సమయంలో సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సూపర్ కింగ్స్ యాజమాన్యం హసీ, బాలాజీలను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి చెన్నై తరలించింది.

దీనిపై చెన్నై ఫ్రాంచైజీ అధికారి ఒకరు స్పందిస్తూ, తమకు చెన్నైలో విస్తృతస్థాయిలో పరిచయాలు ఉన్నాయని, తద్వారా వారిద్దరికీ మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించగలమని భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతానికి హసీ, బాలాజీకి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, వారిద్దరూ బాగానే ఉన్నారని వివరించారు. ముందు జాగ్రత్తగానే వారిని చెన్నై తరలించినట్టు తెలిపారు. ఆస్ట్రేలియా జాతీయుడైన మైఖేల్ హసీ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాడని, నెగెటివ్ సర్టిఫికెట్ వస్తే భారత్ ను వీడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లు భారత్ ను వదిలి వెళ్లేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.