ఒక్కొక్కరు ఒక్కో భాషలో కరోనా ప్రచారం... ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యుల వీడియో ఇదిగో!

06-05-2021 Thu 15:33
  • దేశంలో కరోనా ఉద్ధృతం
  • వీడియో రూపొందించిన ఆర్ఆర్ఆర్ యూనిట్
  • మలయాళంలో మాట్లాడిన రాజమౌళి
  • కన్నడలో ఎన్టీఆర్, తమిళంలో రామ్ చరణ్ సందేశం
  • తెలుగులో సందేశం ఇచ్చిన అలియా భట్
RRR unit members multi lingual campaign against corona

భారత్ లో కరోనా సంక్షోభం నానాటికీ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచారానికి తెరదీసింది. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీలకపాత్రధారి అజయ్ దేవగణ్, కథానాయిక అలియా భట్ ఓ వీడియోలో తమ సందేశాన్ని అందించారు. అయితే, వారందరూ ఒక్కొక్కరు ఒక్కో భాషను ఎంచుకుని తమ సందేశాన్ని అందించడం విశేషం.

రాజమౌళి మలయాళంలో, ఎన్టీఆర్ కన్నడ భాషలో, రామ్ చరణ్ తమిళంలో, అజయ్ దేవగణ్ హిందీలో మాట్లాడారు. కథానాయిక అలియా భట్ తెలుగులో మాట్లాడారు. కచ్చితంగా మాస్కు ధరించాలని, శానిటైజర్ తో తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటుండాలని, భౌతికదూరం తప్పనిసరి అని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను టీకా వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

'స్టాండ్ టుగెదర్' పేరుతో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఈ వీడియోను పంచుకుంది. భిన్న భాషల్లో మాట్లాడడం వల్ల తమ సందేశం అనేక రాష్ట్రాల ప్రజలకు చేరుతుందని ఆర్ఆర్ఆర్ యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.