Sourav Ganguly: బయో బబుల్ ఏర్పాటు చేసినా కరోనా కట్టడి చాలా కష్టం: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly opines on bio bubble system in IPL
  • ఐపీఎల్ 14వ సీజన్ పై కరోనా పంజా
  • పలు ఫ్రాంచైజీల్లో కరోనా కలకలం
  • ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి పాజిటివ్
  • టోర్నీని మధ్యలోనే నిలిపివేసిన బీసీసీఐ
  • ఫుట్ బాల్ లీగ్ లోనూ కరోనా కేసులు వచ్చాయన్న గంగూలీ
ఐపీఎల్ 14వ సీజన్ లో కరోనా కలకలం రేగడంతో టోర్నీని బీసీసీఐ వాయిదా వేయగా, కట్టుదిట్టమైన బయో బబుల్ లో వైరస్ ఎలా ప్రవేశించిందన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కఠిన నిబంధనలు ఉండే బయో బబుల్ లోనూ కరోనాను కట్టడి చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. యూకేలో నిర్వహించిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీలోనూ పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారని గంగూలీ వివరించారు.

ఇక, ఐపీఎల్ 14వ సీజన్ లో బయో బబుల్ ఉల్లంఘనలు ఏవైనా జరిగాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, బోర్డుకు అందిన నివేదిక ప్రకారం బయో బబుల్ అతిక్రమణలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.

"బయో బబుల్ లో ఉన్న వాళ్లు కరోనా బారిన ఎలా పడ్డారన్నది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు దేశంలో ఇంతమందికి కరోనా ఎలా సోకుతోందన్నది చెప్పడం కూడా చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు బయో బబుల్ లో కరోనా చొరబడకుండా నివారించలేక పోతున్నారు. ఇంగ్లండ్ లో సెకండ్ వేవ్ సందర్భంగా ఫుట్ బాల్ లీగ్ లో కరోనా కలకలం రేగింది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ సిటీ, ఆర్సెనల్ క్లబ్ లకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకింది" అని వివరించారు.

అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్నందున, ఐపీఎల్ ను రీషెడ్యూల్ చేయడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అని గంగూలీ అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ సమయం పాటు జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో కరోనా కలకలం రేగితే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీషెడ్యూల్ చేసుకున్నారని, ఎందుకంటే ఆ లీగ్ నిడివి ఆర్నెల్లు అని వివరించారు.

కానీ క్రికెట్ అలా కాదని, ఐపీఎల్ పోటీలు జరిగే సమయంలో కొన్ని దేశాల జట్లు మ్యాచ్ లు ఆడుతుంటాయని, ఆ జాతీయ జట్లకు ఐపీఎల్ ఆటగాళ్లను విడుదల చేయాల్సి ఉంటుందని అన్నారు. ఐపీఎల్ 14వ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో జరిపేందుకు చర్చలు జరుగుతున్నాయని, అప్పటికి భారత్ లో ఎక్కువ కేసులు లేకపోతే స్వదేశంలోనే నిర్వహిస్తామని వివరించారు.
Sourav Ganguly
IPL
Bio Bubble
Corona Virus

More Telugu News