పేర్ని నాని వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి: నారా లోకేశ్‌

05-05-2021 Wed 20:46
  • కరోనా ముదిరిన తర్వాత ఆసుపత్రికి వస్తున్నారని పేర్ని నాని వ్యాఖ్య
  • అప్పుడు ఆక్సిజన్‌ అడిగితే ఎలా తెస్తామన్న మంత్రి
  • తీవ్రంగా మండిపడ్డ లోకేశ్‌
  • సీఎం, మంత్రులకు కనీసం అవగాహన లేదని విమర్శ
Nara lokesh demanded perny nani to apologise people for his comments on corona patients

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం కరోనాపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కరోనా బాధితులకు చికిత్స అందించడం చేతగాక ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పైగా ప్రజల్ని నిందించడం దారుణమైన చర్య అన్నారు.

‘కరోనా ముదిరిన తరువాత వచ్చి ఆక్సిజన్ అడిగితే ఎక్కడ నుంచి తెస్తాం?’ అంటూ మంత్రి పేర్ని నాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు. బెడ్లు, ఆక్సిజన్, మందులు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అలాంటి సర్కార్‌లో కొనసాగుతూ.. ‘ప్రజలదే తప్పు’ అని మాట్లాడటానికి మనసెలా వచ్చింది?  అని ప్రశ్నించారు.

పేర్ని నాని ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగానే.. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్, కనీస సౌకర్యాలు లేక కరోనా బారిన పడి ఆదిలక్ష్మి , నరసింహులు అనే వ్యక్తులు మృతి చెందారని లోకేశ్‌ తెలిపారు. ఇంకో 8 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో కనీసం శ్మశానంలో అంత్యక్రియలకు స్థలం లేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా మంత్రులు, నాయకులు ప్రజల్ని అవమానిస్తున్నారన్నారు. పేర్ని నాని తక్షణమే ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీస వైద్య సౌకర్యాలు కల్పించమని ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు.