Somesh Kumar: కరోనాకు భయపడొద్దు.. ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదు!: తెలంగాణ సీఎస్

  • రాష్ట్రంలో 62 వేల ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి
  • మెడికల్ ట్రీట్మెంట్ కు హైదరాబాద్ హబ్ గా మారింది
  • కర్ణాటక, తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ రావడం లేదు
No chance of imposing lockdown says TS CS Somesh Kumar

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తున్నామని చెప్పారు. కరోనా మందులు, ఆక్సిజన్ కు కొరత లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62 వేల ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని.. ఈ బెడ్ల సంఖ్యను ఇంకా పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని చెప్పారు.

ప్రజలకు నిత్యావసరాల కొరత కూడా లేదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఆడిట్ ను చేస్తున్నామని చెప్పారు. మెడికల్ ట్రీట్మెంట్ కు హైదరాబాద్ ఒక హబ్ గా తయారయిందని... కరోనా బాధితులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కరోనా రోగులకు సరైన వైద్యం అందుతోందని... అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ కు బాధితులు వస్తున్నారని సోమేశ్ కుమార్ అన్నారు. మన ఆసుపత్రుల్లో ఇతర రాష్ట్రాల రోగులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. వాస్తవానికి ఒడిశా నుంచి ఆక్సిజన్ రావాలంటే ఆరు రోజుల సమయం పడుతోందని... కానీ ఎయిర్ లిఫ్ట్ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోందని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ రావడం లేదని అన్నారు. కరోనా కట్టడి కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడటం లేదని చెప్పారు.

More Telugu News