Central Vista: సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ప్రస్తుతం ఆపాలంటూ పిటిషన్లు.. విచారిస్తామన్న సుప్రీంకోర్టు

There is currently a shortage of judges in the Supreme Court says CJI NV Ramana
  • ఢిల్లీలో కొనసాగుతున్న సెంట్రల్ విస్టా నిర్మాణం
  • ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు, ప్రధాని నివాసాల నిర్మాణం
  • కరోనా కష్ట కాలంలో నిర్మాణాలు కొనసాగుతుండటంపై సుప్రీంలో పిటిషన్లు
కరోనా కల్లోల సమయంలో ఢిల్లీలో సెంట్రల్ విస్టా నిర్మాణం కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనంతో పాటు, అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో ప్రధాని నివాసాన్ని కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఈ పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది.

వాదనల సందర్భంగా పిటిషన్ల తరపుపున వాదిస్తూ సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ, మే 17 తర్వాత కానీ ఈ అంశాన్ని విచారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో జడ్జిలు అందుబాటులో లేని విషయాన్ని ప్రస్తావిస్తూ, బెంచ్ అందుబాటులోకి వస్తే కేసును విచారిస్తామని, ఎప్పుడు విచారించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

వాదనల సందర్భంగా పిటిషనర్లు వాదిస్తూ.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడంపై తమకు అభ్యంతరం లేదని.. కాకపోతే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాజ్ పథ్, ఢిల్లీ గేట్ సమీపంలో పనులు కొనసాగడంపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

దాదాపు రూ. 20 వేల కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని అత్యవసర సర్వీసుల కిందకు కేంద్రం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో కూడా విస్టా నిర్మాణం కొనసాగుతోంది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులందరికీ ఆన్-సైట్ అకామడేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విస్టా నిర్మాణంపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
Central Vista
Delhi
Supreme Court

More Telugu News