ఈటల చేసిన పనిని ఎలా సమర్థించుకోవాలి?: కెప్టెన్ లక్ష్మీకాంతరావు మండిపాటు

05-05-2021 Wed 17:54
  • ఈటలను కేసీఆర్ తక్కువ చేసి చూడలేదు
  • అసైన్డ్ భూములు కొనకూడదని తెలిసీ నేరం
  • కేసీఆర్ ఆదేశిస్తే ఈటలపై పోటీ
captain laxmikantha rao fires on Etela Rajendar

పలు ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈటల అనుకున్నంత మంచోడేమీ కాదని, సొంత పార్టీ వారినే ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. బీసీలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారన్నారు. అసైన్డ్ భూములను కొనకూడదని తెలిసి కూడా ఆ పని చేయడాన్ని ఎలా సమర్థించుకోవాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి ఈటలపై పోటీ చేస్తానని లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.